ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఖమ్మం నగరంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించాలంటే పక్కా కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు. జిల్లాస్థాయి సమావేశం అనంతరం ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని, ఆ తర్వాత మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి సీనియర్ నాయకుడిని ఇన్‌చార్జిగా నియమించి, వారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ కుటుంబాల్లోని పట్టభద్రులను గుర్తించి వారంతా ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలన్నారు. అనంతరం తటస్థ ఓటర్లను, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఉన్న ఇతర వర్గాల పట్టభద్రులను కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని భట్టి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు కోటి 6 లక్షల కుటుంబాలకు చెందిన 3.42 కోట్ల మందికి ప్రతి నెలా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, సుమారు 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించామని, సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద సుమారు 53 లక్షల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సామాజిక భద్రతలో భాగంగా 43 లక్షల మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 6 లక్షల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల వరకు వైద్య చికిత్స పొందే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దŠనే ఉద్దేశంతో సుమారు 12.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు ఒక గ్లాసు పాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని, తొలి దశలో 4.5 లక్షల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రెండో దశలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసే దిశగా ఒక్కో నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున ముందుకు సాగుతున్నామని వివరించారు. హైదరాబాద్‌లోనూ పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.40 వేల కోట్లT వెచ్చిస్తున్నదని చెప్పారు. ఇందిరమ్మ జయంతి సందర్భంగా నవంబర్ 19న ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కులం, మతం, ప్రాంత భేదాలు లేకుండా కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందించేలా పథకాన్ని రూపొందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను కరపత్రాల రూపంలో రూపొందించి ప్రతి ఇంటికీ అందించాలని భట్టి విక్రమార్క నాయకులకు సూచించారు. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. రాంరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి వంటి నాయకుల కుటుంబం పార్టీకి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ కోసం నిబద్ధతతో పనిచేసిన ఈ కుటుంబాన్ని పార్టీ ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. సర్వోత్తమ్ రెడ్డిని కేవలం ఒక అభ్యర్థిగా కాక పార్టీ ప్రతినిధిగా భావించి ఆయన విజయం కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఈ జిల్లా బలమైన పునాది ఉన్న ప్రాంతమని పేర్కొంటూ అదే ఐక్యతను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాటాలని, సర్వోత్తమ్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయి, కోరం కనకయ్యలు ప్రసంగించారు. సమావేశానికి డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ అధ్యక్షత వహించగా గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, 'సుడా' చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
Travel the world
Climb the mountains
Deputy CM Bhatti Vikramarka Urges Party CadreEnsure Sarvotham Reddy's Victory with a Massive MajorityKhammam-Warangal-Nalgonda Graduates' MLCtelangana
సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి : పార్టీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment