Travel the world

Climb the mountains

Post Page Advertisement [Top]

Advertisement

తెలంగాణాలో విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూప్ అప్ చార్జీల భారాన్ని మోపడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. పండుగ వేళ ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి, ముక్కుపిండి వసూలు చేస్తామని అధికారులతో చెప్పించడం ప్రజావ్యతిరేక పాలనకు నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని హరీశ్ రావు విమర్శించారు. సరఫరా సరిగ్గా ఉంటే రైతులు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎన్నడైనా కరెంట్ కోసం రోడ్డెక్కారా అని గుర్తుచేశారు. నదుల్లో నీళ్లున్నా లిఫ్ట్ చేయకపోవడం, బొగ్గు నిల్వలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గు కేటాయింపులు లేవన్న ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవమని హరీశ్ రావు స్పష్టం చేశారు. 2018లోనే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎస్సీసీఎల్ నుంచి 14 ఎంటీపీఏ బొగ్గును కేటాయించిన పత్రాలను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో 140 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే, కేవలం 89 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయడం ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగట్టారు. ఎల్ నినోను సాకుగా చూపి ప్లాంట్లను మూసివేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని హరీశ్ రావు ఆరోపించారు. ఎనర్జీ రిఫార్మ్స్ కమిటీ ఏర్పాటు మరియు ఐపీఓ ప్రతిపాదనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ సరఫరా చేసే చౌకైన 1,600 మెగావాట్ల విద్యుత్‌ను తిరస్కరించి, కోతలకు కారణమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]

Advertisement