భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధం : 'స్టార్‌లింక్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ లారెన్ డ్రేయర్ వెల్లడి
దేశవ్యాప్తంగా 100 శాతం డిజిటల్ కనెక్టివిటీ సాధించాలనే ప్రధాని మోడీ ఆశయానికి మద్దతుగా నిలిచేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని 'స్టార్‌లింక్' సీనియర్ ఎగ్జిక్యూటివ్ లారెన్ డ్రేయర్ వెల్లడించారు. ఇప్పటికే ఇన్-స్పేస్, శాటిలైట్ లైసెన్సుల నుంచి ప్రాథమిక అనుమతులు పొందిన స్టార్‌లింక్, ప్రస్తుతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) భద్రతా క్లియరెన్స్, కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది. సుదూర, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంలో స్టార్‌లింక్ శాటిలైట్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని కంపెనీ అభిప్రాయపడింది. భారతీయ భద్రతా అవసరాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు స్టార్‌లింక్ స్పష్టం చేసింది. ముఖ్యంగా భారత వినియోగదారుల డేటాను దేశీయంగానే భద్రపరిచేలా ప్రతి దశలోనూ నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వందలాది యాంటెన్నాలతో కూడిన 20కి పైగా గేట్‌వే సైట్లను ఇప్పటికే నిర్మించామని పేర్కొంది.

Post a Comment