ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెం గ్రామంలో అత్యాధునిక 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ (3డీసీపీ) సాంకేతికతతో ప్రయోగాత్మకంగా 100 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ 2.0 పథకం కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీబీఆర్‌ఐ) ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతోంది. అక్టోబర్ 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీబీఆర్‌ఐ మధ్య ఈ కీలక ఒప్పందం కుదరనుంది. ఇప్పటివరకు ఇతర దేశాల్లో, ప్రైవేట్ రంగంలో మాత్రమే పరిమితమైన ఈ టెక్నాలజీని మన దేశ వాతావరణ పరిస్థితులకు, స్థానిక అవసరాలకు తగ్గట్టుగా సీబీఆర్‌ఐ నిపుణులు మరింత మెరుగుపరిచారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా సరికొత్త నిర్మాణ డిజైన్‌ను కూడా సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఇంటిని సరిగ్గా 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. పీఎంఏవై-గ్రామీణ్ 2.0 కింద సాధారణ ఇళ్లకు ఇచ్చే బడ్జెట్‌తో పోలిస్తే, ఈ 3డీ ప్రింటింగ్ ఇళ్లకు అదనపు ఆర్థిక సాయం అందించనున్నారు. సరికొత్త సాంకేతికతను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ అదనపు భారాన్ని సంయుక్తంగా భరించనున్నాయి. పూర్తిగా రోబోటిక్ పరిజ్ఞానంతో నడిచే ఈ 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ విధానం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ముందుగా ఆర్కిటెక్ట్‌లు కంప్యూటర్‌లోని 3డీ క్యాడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా భవనానికి సంబంధించిన కచ్చితమైన డిజైన్‌ను రూపొందిస్తారు. ఆ తర్వాత 3డీ ప్రింటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కాంక్రీట్ మిశ్రమాన్ని పంపుల ద్వారా నేరుగా ప్రింటర్‌కు అందిస్తారు. కంప్యూటర్ ఇచ్చే కమాండ్ల ప్రకారం రోబోటిక్ హ్యాండ్ లేదా గ్యాంట్రీ ప్రింటర్ పనిచేస్తుంది. నాజిల్ ద్వారా కాంక్రీట్‌ను ఒక క్రమ పద్ధతిలో పొరలు పొరలుగా అమర్చుకుంటూ పోతుంది. వేసిన వెంటనే తొలి పొర గట్టిపడి, దానిపై వచ్చే తదుపరి లేయర్ బరువును తట్టుకునేలా ఈ ప్రత్యేక మిశ్రమాన్ని అభివృద్ధి చేశారు. ఈ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ వల్ల కేవలం సమయమే కాకుండా నిర్మాణ రంగంలో అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దాదాపు 50 నుంచి 70 శాతం వేగంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా గోడల నిర్మాణానికి ఎలాంటి సెంట్రింగ్ సామగ్రి అవసరం ఉండదు. అంతేకాకుండా మెటీరియల్ వృథా అయ్యే శాతం ఏకంగా 30 నుంచి 60 శాతం వరకు తగ్గుతుంది. ఎలాంటి క్లిష్టమైన వంపులు, సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్ డిజైన్లనైనా సరే ఈ టెక్నాలజీ ద్వారా అత్యంత సులువుగా, తక్కువ ఖర్చుతో నిర్మించడం సాధ్యమవుతుంది.
బుర్రిపాలెంలో 3డీసీపీ సాంకేతికతతో ప్రయోగాత్మకంగా వంద ఇళ్లు నిర్మాణం : అక్టోబర్ 4న సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం
الخميس، 1 أكتوبر 2026
Andhra Pradesh Key Agreement to be Signed on October 4 in the Presence of CM Chandrababu Pilot Project to Build 100 Houses Using 3DCP Technology in Burripalem technology Tenali constituency
ليست هناك تعليقات:
إرسال تعليق