తెలంగాణ ఉద్యమాన్ని, ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వ పెద్దలు విచ్చలవిడిగా భూములు దోచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన ఉద్యమకారులు సర్వం కోల్పోతే, పాలకుల కుటుంబాలు మాత్రం వందలాది ఎకరాలను కూడగట్టుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఆధీనంలో భారీగా భూములు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వివరాలతో సహా బయటపెట్టారు. కేసీఆర్ దంపతుల పేరిట నిబంధనల ప్రకారం 27 ఎకరాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం వారి వద్ద 67 ఎకరాలు ఉందని వెల్లడించారు. ఇక కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 123 ఎకరాల భూమి రిజిస్టరై ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో కేటీఆర్ పేరు మీద 49 ఎకరాలు, భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, హిమాన్షు పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఏ వ్యాపారం చేసి ఆ కుటుంబం ఇన్ని ఎకరాలు సంపాదించింది ? ఇదంతా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని దోచుకున్నది కాదా? అని సీఎం రేవంత్ నిలదీశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో దాదాపు 700 ఎకరాల భూమి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫామ్‌హౌస్ భూముల లెక్కలను ఇప్పుడే తేల్చాలని సంబంధిత జిల్లా కలెక్టర్‌ను అసెంబ్లీ సాక్షిగా ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఫామ్‌హౌస్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని కేవలం 30 రోజుల్లోనే స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు, ముఖ్యంగా ఎస్సీలను ఆ భూములకు యజమానులుగా చేస్తామని స్పష్టం చేశారు. ఏ భూమినైతే పసుపు నీళ్లతో శుద్ధి చేశారో, అదే భూమిలో ఎస్సీలకు హక్కులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. సంచలనం సృష్టించిన సత్యం స్కామ్‌కు సంబంధించిన భూములు కేటీఆర్ బంధువుల పేరుతో బదిలీ అయ్యాయని సీఎం ఆరోపించారు. కేటీఆర్ ఫామ్‌హౌస్ కూడా అదే సత్యం స్కామ్ భూముల్లోనే ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, సిద్దిపేట మున్సిపాలిటీ నిధులను దుర్వినియోగం చేస్తూ హరీశ్ రావు తన ఫామ్‌హౌస్‌కు రోడ్లు వేయించుకున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముక్కుసూటి మనిషి కావడంతో కొందరికి ఆయనపై కక్ష పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 22ఏ నిబంధనలపై కావాలనే కుట్రలు పన్నుతూ, పొంగులేటిని ఒక భూతంలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలకు పొంగులేటి బాధ్యుడు కాదని సమర్థించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ దోపిడీలో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని, గత ప్రభుత్వ భూదోపిడీ బండారాన్ని బయటపెడితే "రాస్తే రామాయణం - చెప్తే భారతం" అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో ముగించారు.
0 Comments