పార్టీ మారే ప్రజాప్రతినిధులపై కఠిన నిబంధనలు తీసుకురావాలి : రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్

కేరళలోని కొచ్చిలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నిర్వహించిన 'హార్స్-ట్రేడ్ అండ్ డెమోక్రసీ' అంశంపై  సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రసంగిస్తూ రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ సరిపోవడం లేదని అందువల్ల దాన్ని పూర్తిగా రద్దు చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చి, పార్టీ మారే ప్రజాప్రతినిధులపై కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచించారు. మధ్యంతరంగా పార్టీ మారే ఏ ప్రజాప్రతినిధి అయినా పదేళ్ల పాటు ప్రభుత్వ పదవి, ప్రజా పదవి లేదా రాజ్యాంగబద్ధమైన హోదా చేపట్టకుండా నిషేధించాలని అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని ప్రతిపాదించారు. కేవలం పార్టీ మారిన వారిపైనే కాకుండా, రాజీనామాలు చేసి తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేసే కొత్త తరహా ఫిరాయింపులపై కూడా ఈ పదేళ్ల నిషేధం వర్తింపజేయాలని సిబల్ అభిప్రాయపడ్డారు. యాంటీ డిఫెక్షన్ చట్టంలోని నిబంధనలు ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో వివరించేందుకు సిబల్ గతంలోని బీఎస్పీ ఉదంతాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. అప్పట్లో మూడో వంతు సభ్యులు పార్టీని వీడితే 'స్ప్లిట్'గా పరిగణించే నిబంధనను ఉపయోగించుకునేందుకు దశలవారీగా సభ్యులు పార్టీ మారారని తెలిపారు. చివరకు అవసరమైన సంఖ్యకు చేరుకున్న తర్వాత స్పీకర్ దానిని చెల్లుబాటుగా ప్రకటించారని ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత అది తప్పని తేలిందని చెప్పారు. ఈ నేపథ్యంలో 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పదో షెడ్యూల్‌లోని 'స్ప్లిట్' నిబంధనను తొలగించిందని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం 'మెర్జర్' నిబంధన కూడా అదే తరహాలో దుర్వినియోగం అవుతోందని సిబల్ ఆరోపించారు. ఇటీవలి కాలంలో ఆప్, శివసేన (యూబీటీ), తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పరిణామాలను సిబల్ ప్రస్తావించారు. ఒక పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు మరో పార్టీలో విలీనం కావడం ద్వారా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అన్నారు. ప్రజల తీర్పును ఇలాంటి విలీనాలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. విలీనం అనేది కేవలం శాసనసభా పక్షానికి కాకుండా.. మొత్తం రాజకీయ పార్టీకే సంబంధించినదిగా ఉండాలని కోరుతూ తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సిబల్ వెల్లడించారు. నేను ఓ విషయాన్ని ఒప్పుకుంటున్నాను. నేను ఒక దిమాగీ నక్సల్ ను. భారతదేశం యుద్ధాల్లో ఓడిపోవడానికి ఒక కారణం ఏంటంటే మన దగ్గర గుర్రాలు లేవు, మనం ఏనుగులతో పోరాడాం అన్నారు. నాగరికతల చరిత్రలో గుర్రం అనేది చాలా ముఖ్యమైన అంశం అని మన ముందున్న ఈ సంక్షోభం కేవలం వచ్చిపోయే ఒక సాధారణ రాజకీయ స్కామ్ మాత్రమే కాదన్నారు.

Post a Comment

0 Comments