జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా యూస్‌మార్గ్ ప్రాంతంలో శనివారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా టాప్ కమాండర్ ఒకరు హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని పాక్ జాతీయుడు యాసిర్‌గా జమ్మూ కశ్మీర్ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. గత కొంతకాలంగా యాసిర్ కదలికలపై నిఘా ఉంచిన బలగాలు, పక్కా సమాచారంతో అతన్ని చుట్టుముట్టాయి. తప్పించుకునే క్రమంలో యాసిర్ కాల్పులకు తెగబడటంతో సైన్యం దీటుగా బదులిచ్చి అతన్ని మట్టుబెట్టింది. ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో కీలక ఉగ్రవాదిని అంతం చేయడం లోయలో ఉగ్రవాద నిర్మూలనకు పెద్ద ముందడుగుగా అధికారులు భావిస్తున్నారు. "నువ్వు పారిపోగలవు, కానీ దాగలేవు" అంటూ జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్స్ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. హతమైన యాసిర్ గతంలో లష్కరే తొయిబాలోని సులేమాన్ మూసా గ్రూప్‌లో కీలకంగా పనిచేశాడు. సుమారు ఏడాది క్రితం ఆ వర్గం నుంచి విడిపోయిన అతను, యూస్‌మార్గ్ ప్రాంతంలో సొంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. స్థానికంగా యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో, దాడులకు కుట్రలు పన్నడంలో ఇతను ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కొద్ది రోజులుగా ఇతని కోసం జల్లెడ పడుతున్న బలగాలకు శనివారం ఉదయం యాసిర్ తారసపడటంతో కాల్పులు జరిగాయి.

Post a Comment

أحدث أقدم