తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని భావనారుషిపేటలో ఉన్న మద్దెలమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలోని నగదుతో పాటు సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. ప్రతి శుక్రవారం మాదిరిగానే రాత్రి 10 గంటల వరకు ఆలయంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం ఆలయంలో హోమం ఉండటంతో ఏర్పాట్ల కోసం పనివారు వచ్చి చూడగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రధాన ద్వారం గేటు తాళాన్ని పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆలయ ఆవరణలోని హుండీ తాళాన్ని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించారు. చోరీకి సంబంధించిన ఆధారాలు లభించకుండా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలను సైతం ఎత్తుకెళ్లారు. గత నెలలో జరిగిన బోనాల ఉత్సవాల సందర్భంగా హుండీని తెరిచి బ్రహ్మోత్సవాల ఖర్చుల కోసం నగదును వినియోగించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత బోనాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలో సుమారు రూ.25 వేల వరకు నగదు ఉండవచ్చని స్థానికులు, ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9:06 గంటల వరకు మాత్రమే సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయినట్లు సమాచారం. ఆ తర్వాత సాంకేతిక సమస్య కారణంగా కెమెరాలు పనిచేయలేదా? లేక దుండగులే ముందస్తుగా వాటిని నిలిపివేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ఎస్సై జగన్, క్లూస్ టీమ్ ఎస్సై శివకుమార్, పోలీసు సిబ్బంది లింగం, గోపాల్, సాయిలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి వేలిముద్రల నమూనాలను సేకరిస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
భూదాన్ పోచంపల్లి దేవాలయంలో చోరీ : సీసీ కెమెరాలను దొంగిలించిన దుండగులు
Saturday, September 19, 2026
Maddelamma Thalli Temple Miscreants Steal Cash and CCTV Cameras telangana Theft at Bhoodan Pochampally Temple Yadadri Bhuvanagiri district
No comments:
Post a Comment