టెలికాం ఆపరేటర్లు కచ్చితంగా 28 రోజుల వ్యాలిడిటీతో 'వాయిస్, ఎస్‌ఎంఎస్ మాత్రమే' ఉండే రీఛార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తేవాలని ట్రాయ్ ఆదేశించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ వారంలోనే వెలువడే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్లాన్ల ధరలపై ఇంకా స్పష్టత రాలేదు. కేవలం వైఫై వాడేవారు, ఇంట్లోని పెద్దవారు, సెకండరీ సిమ్ లేదా ఫీచర్ ఫోన్లు వాడేవారు, అలాగే కేవలం ఓటీపీల కోసమే సిమ్ కార్డులు ఉంచుకునే వారికి ఇది ఎంతో ఊరటనివ్వనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్లాన్లు టెలికాం యాప్‌లలో దర్శనమివ్వనున్నాయి. అంతకుముందు డిసెంబర్ 2024లో తెచ్చిన నిబంధనల ప్రకారం ఆపరేటర్లు కనీసం ఒక్కటైనా వాయిస్, ఎస్‌ఎంఎస్ మాత్రమే ఉండే వోచర్‌ను అందించాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ట్రాయ్ తీసుకొచ్చిన డ్రాఫ్ట్‌లో 28 రోజులతో సహా ప్రతి వ్యాలిడిటీ ప్లాన్‌లోనూ ఈ ఆప్షన్ ఉండాలని ప్రతిపాదించింది. అయితే టెలికాం కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. రీఛార్జ్ ధరలు, ప్లాన్ల రూపకల్పన మార్కెట్ ఆధారంగానే ఉండాలని వాదించాయి. కేవలం వాయిస్/ఎస్‌ఎంఎస్ ప్లాన్లను నిర్బంధం చేయాల్సిన అవసరం లేదని జియో స్పష్టం చేసింది. ఇటువంటి తక్కువ ధర ప్లాన్ల వల్ల వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం తగ్గిపోతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. 28 రోజుల నుంచి 365 రోజుల వ్యాలిడిటీ వరకు ప్రతి రెగ్యులర్ ప్లాన్‌కు తగ్గట్టుగా కేవలం వాయిస్, ఎస్‌ఎంఎస్ ఆప్షన్ మాత్రమే ఉండే ప్యాక్‌లు రానున్నాయి. అలాగే ఈ ప్లాన్‌లు యాప్‌లలో సులభంగా వెతికి పట్టుకునేలా ఉంచాలని, ఫిల్టర్ల వెనుక దాచకూడదని ట్రాయ్ స్పష్టం చేసింది. ఇక ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ 28 రోజుల బండిల్ ప్లాన్లతో పోల్చి చూసుకోవచ్చు. ఉదాహరణకు, ఎయిర్‌టెల్ ₹199 ప్యాక్‌లో అపరిమిత కాల్స్, మొత్తం 2GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తున్నాయి. ఈ ప్లాన్లలో డేటా బెనిఫిట్స్ ఉండవు కాబట్టి, సాధారణ బండిల్ ప్యాక్‌ల కంటే తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అయితే టెలికాం కంపెనీలు అధికారిక టారిఫ్‌లు ప్రకటించే వరకు వేచి చూడాలి.
0 Comments