పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మదర్సాలపై తీవ్ర స్థాయిలో ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సరైన అనుమతులు, కనీస మౌలిక వసతులు లేవని తేలడంతో ఏకంగా 252 మదర్సాలను తక్షణమే మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరో 100 మదర్సాలకు షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యాశాఖ మంత్రి క్షుదీరామ్ తుడు ఈ వివరాలను వెల్లడిస్తూ.. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు కలిగి ఉన్న మదర్సాలు మాత్రమే యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనుమతులు లేని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనుమతి ఉన్న, అనధికారిక మదర్సాల లెక్క తేల్చాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదేశించిన నేపథ్యంలో.. జూన్ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ మదర్సాల నిర్వహణ, మౌలిక వసతులు, అనుమతులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించినట్లు మంత్రి వివరించారు. షోకాజ్ నోటీసులు అందుకున్న మదర్సాల వివరణను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దిలీప్ ఘోష్ మాట్లాడుతూ మదర్సాల చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయని, కొన్ని సంస్థల్లో ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పట్టుబడిన ఉదంతాలు కూడా ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారేలా విచక్షణారహితంగా మదర్సాలను తెరవడానికి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోదని, చట్టబద్ధంగా నడిచే వాటికే రక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని మదర్సాలను ఒకే గాటన కట్టి చూడటం, దేశద్రోహ ముద్ర వేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
పశ్చిమ బెంగాల్లో 252 మదర్సాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశం : మరో వంద సంస్థలకు నోటీసులు జారీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق