ధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా జైలులో ఓ విచారణ ఖైదీ నీలేశ్ ఠాకూర్ జైలు గార్డుపై కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఈ దృశ్యాలు బయటకు రావడం గమనార్హం. పండ్ల బుట్టలో దాచిన తుపాకీతో ఖైదీ జైలు గార్డుపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలిక జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా జైలులో నిర్వహించిన వేడుకల సమయంలో అతడు జైలు గార్డు దిగ్విజయ్ సింగ్ తోమర్‌పై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్యాయత్నం కేసులో ఠాకూర్ జైలులో ఉన్నట్లు ఉపవిభాగ పోలీసు అధికారి ప్రతిభా శర్మ తెలిపారు. గార్డును ఠాకూర్ ఒక్కసారిగా పట్టుకుని కాల్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. గార్డు తిరిగి ఎదురుదాడికి ప్రయత్నించగా ఖైదీ అతడిని పక్కకు నెట్టేసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో ఉంది. ఠాకూర్ పండ్ల బుట్టతో ప్రధాన ద్వారం వద్దకు వెళ్లి దాన్ని తెరవాలని తోమర్‌ను ఒత్తిడి చేశాడు. గార్డు నిరాకరించడంతో.. బుట్టలో దాచిన దేశీయంగా తయారు చేసిన తుపాకీని బయటకు తీసి అతడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాల్పుల్లో బుల్లెట్ తోమర్ వీపు ఎడమ వైపున తగలడంతో అతడు కుప్పకూలాడు. జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక జైలు సూపరింటెండెంట్ ఆర్కే.చౌరే, ఇతర గార్డులు వెంటనే అక్కడికి చేరుకుని ఠాకూర్‌ను పట్టుకున్నారని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆయుధం జైలులోకి ఎలా చేరిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో తీవ్రమైన నిర్లక్ష్యం జరిగినట్లు అధికారులు గుర్తించడంతో చౌరేను వెంటనే సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సమయంలో ఆయనను జైలు ప్రధాన కార్యాలయంలో విధులకు కేటాయించారు. దర్యాప్తును జైళ్ల శాఖ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజయ్ పాండేకు అప్పగించారు. మధ్యప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ వరుణ్ కపూర్ మాట్లాడుతూ.. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. భద్రతా లోపంలో జైలు గార్డుల పాత్ర ఏమైనా ఉందా? ఠాకూర్‌కు ఆయుధం అందేందుకు ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో.. బయట నుంచి ఎవరో తుపాకీని జైలు లోపలికి విసిరారని ఠాకూర్ చెప్పినట్లు తెలుస్తోంది. రక్షాబంధన్ వేడుకల కోసం జైలులోకి తీసుకొచ్చిన స్వీట్లు, పండ్ల బుట్టల్లో ఒకదానిలో తుపాకీని దాచి ఉండవచ్చని చౌరే అంతకుముందు అనుమానం వ్యక్తం చేశారు. తుపాకీ జైలులోకి ఎలా చేరింది? ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? అనే విషయాలను దర్యాప్తు తేల్చనుంది.

Post a Comment

أحدث أقدم