Ad Code

రైల్వే స్టేషన్ల తాగునీటి నమూనాల్లో ఈ-కోలి బ్యాక్టీరియా : కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక

దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందాల్సిన కనీస సౌకర్యాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఆడిట్‌ చేసిన స్టేషన్లలో కేవలం 11 శాతం స్టేషన్లలో మాత్రమే అన్ని ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు తేలింది. కొన్ని స్టేషన్లలో తాగునీటి నమూనాల్లో ఈ-కోలి బ్యాక్టీరియా కూడా గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. 2019-20 నుంచి 2023-24 వరకు పరిస్థితులను ఈ ఆడిట్‌లో పరిశీలించారు. కాగ్ మొత్తం 512 నాన్‌-సబర్బన్‌ రైల్వే స్టేషన్లను పరిశీలించింది. దేశవ్యాప్తంగా 5,900కు పైగా ఉన్న స్టేషన్లలో ఇది సుమారు 8.66 శాతం. పరిశీలించిన వాటిలో కేవలం 54 స్టేషన్లలోనే నిర్దేశించిన అన్ని కనీస అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఈ లోపాల నుంచి తప్పించుకోలేదని కాగ్ తెలిపింది. న్యూఢిల్లీ, హౌరా, హజ్రత్‌ నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, అహ్మదాబాద్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌, కేఎస్‌ఆర్‌ బెంగళూరు, సూరత్‌, ఆనంద్‌ విహార్‌ టెర్మినల్‌ వంటి స్టేషన్లలోనూ కొన్ని ప్రాథమిక సౌకర్యాల కొరత కనిపించింది. 188 స్టేషన్లలో తగిన సంఖ్యలో తాగునీటి కుళాయిలు లేవు. మరో 21 స్టేషన్లలో వెయిటింగ్‌ హాళ్లు అందుబాటులో లేవని గుర్తించారు. 111 స్టేషన్లలో అవసరమైన సంఖ్యలో యూరినల్స్‌ లేవు. 59 స్టేషన్లలో సరిపడా మరుగుదొడ్లు లేవు. 62 స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌ కవరేజీ లేదా షెల్టర్ల విస్తీర్ణం నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. 60 స్టేషన్లలో గడియారాలు లేవు. 128 స్టేషన్లలో అవసరమైన సంఖ్యలో వాటర్‌ కూలర్లు లేవు. 149 స్టేషన్లలో ప్రమాణాలకు అనుగుణంగా చెత్తబుట్టలు ఏర్పాటు చేయలేదు. దివ్యాంగ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల్లోనూ గణనీయమైన లోపాలను కాగ్ గుర్తించింది. రైలింగ్‌తో కూడిన ప్రమాణ ర్యాంపులు, ప్రత్యేక పార్కింగ్‌, జారిపోని నడక మార్గాలు, ప్రతి ప్లాట్‌ఫామ్‌లో ప్రత్యామ్నాయ వాటర్‌ బూత్‌ల వద్ద తాగునీటి కుళాయిలు వంటి సదుపాయాలు అనేక చోట్ల పూర్తి స్థాయిలో లేవని నివేదిక పేర్కొంది. ప్రయాణికులకు అందించే తాగునీటి నాణ్యతపైనా కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కోయంబత్తూరు, పాలక్కాడ్‌ జంక్షన్‌, హైదరాబాద్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌, భివాండి రోడ్‌, కల్యాణ్‌, లోనావాలా, మధుపూర్‌ స్టేషన్లలో వాటర్‌ కూలర్ల నుంచి సేకరించిన నీటి నమూనాల్లో ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. 11 జోన్ల పరిధిలోని 179 స్టేషన్లలో హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు తాగునీటికి రసాయన పరీక్షలు నిర్వహించలేదని తెలిపింది. మరో 6 జోన్లలోని 77 స్టేషన్లలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించాల్సిన పరీక్షలు నిర్ణీత వ్యవధిలో జరగలేదని పేర్కొంది.ఇంకా పరిశీలించిన 512 స్టేషన్లలో ఏ ఒక్క స్టేషన్‌లోనూ 'యూనిఫామ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ క్వాలిటీ ప్రోటోకాల్‌'లో పేర్కొన్న అన్ని ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించలేదని నివేదిక వెల్లడించింది. స్టేషన్ల పారిశుద్ధ్య నిర్వహణ కోసం రైల్వే శాఖ ఏటా సుమారు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లోపాలు కొనసాగుతున్నాయని CAG పేర్కొంది. 2022-23లో స్టేషన్‌ పారిశుద్ధ్యానికి కేటాయించిన బడ్జెట్‌ కంటే రూ.72.66 కోట్లు అధికంగా, 2023-24లో రూ.9.20 కోట్లు అధికంగా ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది.స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలను పర్యవేక్షించాల్సిన జోనల్‌, డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కౌన్సిళ్లు కూడా నిర్దేశించిన విధంగా ఏడాదికి మూడుసార్లు సమావేశం కాలేదని గుర్తించింది. రైల్‌మదద్‌ ద్వారా నమోదైన ఫిర్యాదులను పరిశీలించగా.. వైద్య సహాయం, పరిశుభ్రత, విద్యుత్‌ పరికరాల పనిచేయకపోవడం, స్టేషన్లలో నీటి లభ్యత వంటి అంశాలపై ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్లు తేలింది. ఫిర్యాదులు లేదా సూచనలు ఇచ్చిన ప్రయాణికుల్లో 2022-23లో 37 శాతం, 2023-24లో 42 శాతం తమ సమస్యల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది. ప్రయాణికుల సౌకర్యాల కోసం చేపట్టిన పనుల్లో కూడా జాప్యం కనిపించింది. సుమారు 59 శాతం ప్యాసింజర్‌ అమెనిటీస్‌ పనులు ఆలస్యమైనట్లు CAG గుర్తించింది. అలాగే 2019-20 నుంచి 2023-24 మధ్య 'కస్టమర్‌ అమెనిటీస్‌' కోసం కేటాయించిన నిధుల్లో 36 నుంచి 44 శాతం వరకు వినియోగం కాలేదని నివేదిక పేర్కొంది.


Post a Comment

0 Comments

Close Menu