ఆంధ్రప్రదేశ్ లోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాంతీయ ప్రాతిపదికన కాకుండా వేద, ఆగమ పరిజ్ఞానం, అర్హత, ప్రతిభ, మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపడుతున్నామని శాసనసభలో తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన అర్చకులు, వేద పండితులకు అన్యాయం జరుగుతోందా? శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? రాయలసీమ జోన్‌ను పరిగణనలోకి తీసుకుని స్థానిక నిరుద్యోగ అర్చకులు, వేద పండితులకు అవకాశాలు కల్పించేందుకు ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను సమీక్షించే ప్రతిపాదన ఉందా? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదన్నారు. దీనికి ఇటీవల చేపట్టిన నియామకాలే నిదర్శనమని చెప్పారు. మొత్తం 344 పోస్టుల భర్తీలో 172 పోస్టులను రాయలసీమ ప్రాంతంలోని ప్రధాన దేవాలయాల్లో భర్తీ చేసినట్లు వెల్లడించారు. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రముఖ దేవాలయాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి అర్హులైన వేద, ఆగమ పండితులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ప్రాంతీయ ప్రాతిపదిక కంటే వేదం, ఆగమంపై అభ్యర్థులకున్న పరిజ్ఞానానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నియామకాల్లో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు చెందిన వేద, ఆగమ పండితులను ఎంపిక కమిటీల్లో సభ్యులుగా నియమించి, వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు మంత్రి వివరించారు. సుమారు 1,400 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, కేవలం 15 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి రావడంతో పోటీ తీవ్రంగా ఉందన్నారు. ఒకటి, రెండు మార్కుల తేడాతోనూ ఎంపికలు జరిగాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతం నుంచి 1,431 దరఖాస్తులు వచ్చాయని, అర్హత సాధించిన వారిలో 172 మందికి అవకాశం లభించిందని మంత్రి తెలిపారు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలకు సంబంధించిన నియామకాల్లోనూ అర్హత, వేద పరిజ్ఞానం, మెరిట్ ఆధారంగానే ఎంపికలు జరిగాయని వివరించారు. నియామక ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌తో నిర్వహించామని, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులకు కూడా రికార్డింగ్ చూపించే స్థాయిలో పారదర్శకత పాటించామని మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు స్పష్టం చేశారు. జోన్-4 పరిధిలోని ప్రధాన దేవాలయాల్లో మొత్తం 440 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 245 మంది పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇంకా 147 ఖాళీలు ఉన్నాయని, వాటిని కూడా నిబంధనల ప్రకారం త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాన దేవాలయాల్లో భక్తులకు శాస్త్రోక్తంగా, ఆగమబద్ధంగా సేవలు అందించాలంటే నైపుణ్యం కలిగిన అర్చకులు, వేద పండితులు, ఆగమ పండితులు అవసరమని మంత్రి అన్నారు. అందుకే ప్రాంతం కంటే అర్హత, ప్రతిభ, వేద-ఆగమ పరిజ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీకి వివరించారు.
ホーム
/
Vedas and Agamas
/
ఆలయాల్లో అర్చకుల నియామకాల్లో మెరిట్‌కే ప్రాధాన్యం !
Tuesday, August 18, 2026
and merit Andhra Pradesh Merit Prioritized in Temple Priest Appointments Minister Anam Ramanarayana Reddy Reveals in Assembly qualifications rather than on a regional basis talent Vedas and Agamas
No comments:
Post a Comment