రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిన మహ్మద్ ఇర్ఫాన్ : నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఖాతాను తొలగించిన యూట్యూబ్‌


ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయిపోయారు. అయితే, అంతలోనే ఆయన ఖాతాను యూట్యూబ్‌ తొలగిచింది. దీనిపై యూట్యూబ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. అయితే ఇర్ఫాన్ పేజీ 'మెయిన్ ఇర్ఫాన్'ను తెరవడానికి ప్రయత్నిస్తే "గూగుల్ సేవా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఈ ఖాతాను తొలగించాం" అనే సందేశం కనిపిస్తోంది. ఇర్ఫాన్ కూడా ఎక్స్‌లో స్పందించారు. ఖాతా తొలగింపు "ఏదో పొరపాటు" వల్ల జరిగి ఉంటుందని చెబుతూ, దానిని సరిచేయాలని యూట్యూబ్‌ను కోరారు. "నా ఛానల్ పూర్తిగా కొత్తది. యూట్యూబ్ మార్గదర్శకాలను నేను నిజాయితీగా పాటించాను" అని ఇర్ఫాన్ పేర్కొన్నారు. "ప్రజలు నా కంటెంట్‌ను ఎంతో ఇష్టపడ్డారు. అందుకే సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. మీ ఆటోమేటిక్ వ్యవస్థ వల్ల పొరపాటు జరిగి ఉండొచ్చు. దయచేసి నా ఛానల్‌ను మరోసారి పరిశీలించి పునరుద్ధరించండి" అని అన్నారు. ఇర్ఫాన్ ఛానల్‌కు సీనియర్ జర్నలిస్టు అజిత్ అంజుమ్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఛానల్ యాక్టివ్‌గా ఉన్న సమయంలో, అది తొలగించిన తర్వాత కూడా ఆయన ఎక్స్‌లో పలుసార్లు పోస్టులు చేశారు. "ఢిల్లీలోని ఒక మురికివాడలో నివసించే మహ్మద్ ఇర్ఫాన్ అనే యువకుడు మా సహకారంతో నిన్ననే తన యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు" అని అజిత్ అంజుమ్ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు. "నిన్న సాయంత్రం నుంచి ఈ ఉదయం వరకూ అతని ఛానల్‌కు 70,000 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఈ ఉదయం అకస్మాత్తుగా అతని యూట్యూబ్ ఛానల్‌ను తొలగించారు. ఆ యువకుడు ఇంత తక్కువ సమయంలో ఇంతమంది సభ్యులను ఎలా సంపాదించాడు? అదే ఒక అసాధారణ విజయం. మరి యూట్యూబ్ అతని ఛానల్‌ను ఇంత హఠాత్తుగా ఎందుకు తొలగించింది?" అని ప్రశ్నించారు. ఇంకా పలువురు సోషల్ మీడియా యూజర్లు కూడా ఇర్ఫాన్ పేజీకి మద్దతుగా పోస్టులు చేశారు. ఆ కంటెంట్, ఛానల్ నిజమైనవేనని, గూగుల్‌కు చెందిన యూట్యూబ్ ఆటోమేటెడ్ వ్యవస్థల పొరపాటు వల్లే ఖాతా తొలగింపు జరిగిందని పేర్కొన్నారు. ఈ సమస్యను సరిచేయాలని యూట్యూబ్‌ను కోరారు.

Post a Comment

0 Comments