Ad Code

మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు రెండు వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఈడీ ప్రత్యేక కోర్టు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నిన్న హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. నాంపల్లిలోని ఈడీ ప్రత్యేక కోర్టులో కారుమూరిని హాజరుపర్చగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఆయనకు రెండు వారాల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ మద్యం రవాణా సబ్‌కాంట్రాక్టును తన కుమారుడు కారుమూరి సునీల్‌కు ఇప్పించుకున్న కారుమూరి నాగేశ్వరరావు..భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. మద్యం సరఫరా కాంట్రాక్టు ఖరారు అధికారాలను జిల్లా స్థాయి కమిటీల నుంచి తప్పించి రాష్ట్ర స్థాయికి మార్చి, తమకు అనుకూలంగా ఉన్న సిగ్మా సంస్థకు కట్టబెట్టారని చెబుతోంది. కిలోమీటరుకు రూ.19.68గా ఉన్న రవాణా ఛార్జీని ఏకంగా రూ. 32.53కు పెంచి లబ్ధి పొందినట్లు ఈడీ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ అనే డొల్ల కంపెనీ ద్వారా సబ్‌కాంట్రాక్టు చేసుకుని , కొల్లగొట్టిన సొత్తులో 85 శాతం మొత్తాన్ని హవాలా మార్గాల్లో కారుమూరి కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి మళ్లించారని ఆరోపిస్తోంది. ఈ డబ్బునే విజయవాడ, తణుకుల్లోని కారుమూరి నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాల నిర్వహణకు, వ్యక్తిగత వాహనాల డీజిల్, ప్రయాణ ఖర్చులకు ఖర్చు చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఇలా జరిగిన మొత్తం రూ.68 కోట్ల లావాదేవీల్లో ఇప్పటివరకు రూ.15 కోట్లను గుర్తించారు. మనీలాండరింగ్‌ ద్వారా సంపాదించిన డబ్బుతో కొన్న రూ. 37.7 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. వీటిలో హైదరాబాద్‌లోని కోకాపేట, ఖాజాగూడలో ఆస్తులు, అనకాపల్లిలోని గ్రానైట్ క్వారీ లీజు హక్కులు, దిల్లీ, గురుగ్రామ్‌లలోని కమర్షియల్ యూనిట్లు, లగ్జరీ వాహనాలు, ఖరీదైన వాచ్‌లు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Close Menu