తైపీ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ తన్వీ శర్మ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో తన్వీ శర్మ ఆరో సీడ్ క్రీడాకారిణి అయిన వియత్నాంకు చెందిన థున్ లిన్ గుయెన్‌ను 21-16, 21-16 తేడాతో ఓడించి తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో తైపీ ఓపెన్లో మహిళల సింగిల్స్ గెలిచిన సైనా నెహ్వాల్ తర్వాత తొలి భారత క్రీడాకారిణిగా తన్వీ శర్మ నిలిచింది. 2008 సీజన్లో సైనా నెహ్వాల్ ఇక్కడ టైటిల్ గెలుచుకుంది. దీంతో భారత్ 17 ఏళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టైటిల్ మ్యాచ్ కేవలం 36 నిమిషాలు మాత్రమే సాగినా.. ఈ మ్యాచ్ తన్వీ కోర్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మొదటి గేమ్‌లో అద్భుతమైన నెట్ కంట్రోల్, అద్భుతమైన డ్రాప్ షాట్లు, క్రాస్-కోర్ట్ స్మాష్‌ల పుణ్యమా అని ఆమె ఆరంభంలోనే ఆధిక్యం సాధించింది. మధ్యలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల గుయెన్ పుంజుకునే అవకాశం లభించింది. కానీ తన్వీ శర్మ సంయమనం కోల్పోకుండా మొదటి గేమ్‌ను 21-16 తేడాతో గెలుచుకుంది. రెండో గేమ్‌లో థున్ లిన్ గుయెన్ దూకుడుగా ప్రారంభించి 3-0 ఆధిక్యం సాధించింది. కానీ తన్వీ శర్మ ఆ ఒత్తిడికి లొంగలేదు. ఆమె సంయమనంతో పోరాడుతూ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. నిలకడగా రాణించి తన్వీ శర్మ రెండో గేమ్ ను 21-16 తేడాతో గెలుచుకుంది. వరుసగా రెండు గేమ్‌లలో విజయం సాధించి టైటిల్ గెలిచింది. ఈ విజయం కేవలం ఓ టైటిల్ మాత్రమే కాదు.. భారత బ్యాడ్మింటన్‌కు ఓ కొత్త ఆశ కూడా. 2008లో సైనా నెహ్వాల్ తైపీ ఓపెన్ గెలిచి భారత మహిళల బ్యాడ్మింటన్‌లో ఓ కొత్త విప్లవాన్ని ప్రారంభించింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత అదే టోర్నీలో తన్వీ శర్మ గెలుచుకున్న టైటిల్.. భారత్ తన తదుపరి మహిళా సింగిల్స్ స్టార్‌ను కనుగొందని సంకేతాలిస్తోంది.
0 Comments