పోలవరం ప్రాజెక్టు, గోదావరి నీటి వినియోగం, బనకచర్ల అనుసంధానం వంటి కీలక అంతర్రాష్ట్ర జల వివాదాల అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ వ్యవహారాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అయితే, ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో తాత్కాలికంగా చుక్కెదురైంది. బనకచర్ల అనుసంధానం, పోలవరం అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని, అలాగే ఈ పనులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. అయితే, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పేర్కొంది. ఆ లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌పై ప్రాథమికంగా పూర్తిస్థాయి విచారణ జరపకుండా, లోపాలు ఉన్న పిటిషన్ ఆధారంగా ఎదుటి పక్షానికి నోటీసులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఈ సందర్భంగా ధర్మాసనానికి వివరించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ముందుగా పిటిషన్‌లో ఉన్న లోపాలన్నింటినీ సరిదిద్దాలని, ఆ తర్వాతే విచారణ చేపట్టి మిగతా అంశాలను, ప్రతివాదుల పాత్రను పరిశీలిస్తామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

Post a Comment

أحدث أقدم