తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాల వారీగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఉన్న మొత్తం 15,982 ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. వీటికి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల (హెల్పర్స్) పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇదే తరహాలో త్వరలోనే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగ ప్రకటనలు విడుదల కానున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అంగన్‌వాడీ ఉద్యోగుల ఎంపిక కోసం ఈసారి ప్రభుత్వం సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతతో పాటు ఇంటర్వ్యూను తప్పనిసరి చేశారు. ఈ కొత్త విధానానికి అనుమతి తెలుపుతూ ప్రభుత్వం జీవో నెం.4ను, మార్కుల వెయిటేజీకి సంబంధించి జీవో నెం.6ను కూడా జారీ చేసింది. మల్టీజోన్ - 1 పరిధిలో: ఈ జోన్ పరిధిలో మొత్తం 20,584 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో 1,853 టీచర్ పోస్టులు, 7,737 సహాయకుల (హెల్పర్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీజోన్ - 2 పరిధిలో: ఈ జోన్ పరిధిలో మొత్తం 15,197 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా.. వీటిలో 1,247 టీచర్ పోస్టులు, 5,145 సహాయకుల (హెల్పర్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
0 Comments