వచ్చే మూడేళ్లలో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు టీసీఎస్‌లో పని చేస్తారు !

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 31వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో టీసీఎస్‌లో మానవ ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లు పని చేస్తారని అంచనా వేశారు. జనరేటివ్ ఏఐ, ఆటోమేషన్ల కారణంగా భారతీయ ఐటీ సేవల సంస్థల సాంప్రదాయ వ్యాపార నమూనాలు దెబ్బతింటాయేమోనన్న ఇన్వెస్టర్ల ఆందోళనల నేపథ్యంలో చంద్రశేఖరన్ చేసిన ఈ వ్యాఖ్యలు పరిశ్రమలో కొత్త భరోసాను నింపాయి. ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యయాన్ని ఏఐ ఎలా మార్చబోతోందనే అంశంపై మార్కెట్‌లో ఉన్న అపార్థాల వల్లే ఇటువంటి భయాలు వ్యక్తమవుతున్నాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదు. అది మేధస్సుకు సంబంధించిన ఒక మౌలిక సదుపాయం. ఈ మేధస్సు తాలూకు వ్యయం తగ్గుతున్న కొద్దీ మరిన్ని వ్యాపార ప్రక్రియలు, వ్యూహాత్మక నిర్ణయాలు, కస్టమర్ పరస్పర చర్యలు ఏఐ ఆధారిత పరివర్తన వైపు అడుగులు పడుతాయని చంద్రశేఖరన్ అన్నారు. ఏఐ అంతరాయం కలిగిస్తుందనే భయాలు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రాథమిక సూత్రాలు బలంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కంపెనీ మార్జిన్లు బాగున్నాయని, ఆదాయాలు పెరిగాయని, డీల్ పైప్‌లైన్ గతంలో కంటే ఎంతో బలంగా ఉందని వివరించారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మూడొంతుల సంస్థలు తమ సాంకేతిక వ్యయాన్ని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments