సూయజ్‌ కెనాల్‌కు వెళ్లే మార్గంలోని మాండెబ్‌ జలసంధిని మూసివేస్తామని యెమెన్‌లోని హూతీలు హెచ్చరించారు. ప్రపంచ శాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొనసాగిస్తే తాము బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి దానిని మూసేస్తే, తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికీ సాధ్యం కాదని హూతీ ప్రభుత్వ విదేశాంగశాఖ ఉప మంత్రి హుస్సేన్ పేర్కొన్నారు. ప్రపంచ శాంతికి ఆటంకం కలిగించే అన్ని చర్యలను ట్రంప్‌ ఆపేయాలని హూతీలు హెచ్చరించారు. ఈ విధ్వంసం నుంచి వెనక్కి మళ్లాలని అమెరికాకు సహకరించే దేశాలకు సూచించారు. అదే అందరికీ శ్రేయస్కరమన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌తో చేసుకున్న ఏకపక్ష కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్‌కు అవమానకరమని హెజ్‌బొల్లా సెక్రటరీ-జనరల్ నయీమ్ అభివర్ణించారు. ఏకపక్ష కాల్పుల విరమణకు తమ బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నారు. యెమన్, జిబౌటి మధ్య మాండెబ్‌ జలసంధి ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయజ్‌ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌కు మధ్య ద్వారంలా ఇది ఉంది. దీని వెడల్పు దాదాపు 30 కి.మీ. మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం దీని ద్వారానే పయనిస్తోంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్‌ఎన్‌జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా రూ.93.95 లక్షల కోట్ల విలువైన సరకులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా వేసింది. 

Post a Comment

Previous Post Next Post