అండమాన్ సముద్రంలో పడవ బోల్తా పడి 250 మంది గల్లంతయ్యారు. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ఓ నౌక బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు వెళ్తోంది. దక్షిణ బంగ్లాదేశ్ లోని టేక్నాఫ్ ప్రాంతం నుంచి ఈ పడవ బయలుదేరింది. అండమాన్ సముద్రం వద్దకు వచ్చేసరికి వాతావరణం అనుకూలించకపోవడం, సామర్థ్యానికి మించి ఆ బోటులో ప్రయాణికులు ఉండటం వల్ల ఆ పడవ బోల్తా పడినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రస్తుతం ఆ సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఎక్కవమంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. మయన్మార్ లో హింసను తట్టుకోలేక 2017లో లక్షలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ కు వలస వచ్చారు. అక్కడ కాక్స్ బజార్లోని శిబిరాల్లో ఉంటున్నారు. కానీ ఈ మధ్య అక్కడ సరైన జీవన సౌకర్యాలు ఉండటం లేదు. పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ శిబిరాల్లో ఉన్నవారు మెరుగైన జీవనం కోసం అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సముద్ర మార్గం గుండా మలేసియా లాంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న బంగ్లాదేశ్ నుంచి ఆ పడవ బయలుదేరింది. బలమైన ఈదురు గాలుల వల్ల తాజాగా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. శరణార్థుల రక్షణ కోసం అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాలని కోరాయి. ఇలాంటి ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి.
إرسال تعليق