తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్‌రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. ప్రభుత్వం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . మొదటి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది. మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది.
0 Comments