Ad Code

జూబ్లీహిల్స్‌లో 2కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ చేసి పరారైన నేపాలీ దంపతులు


హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పని చేస్తున్న ఇంటికే నేపాలీ దంపతులు కన్నం వేశారు . ఓ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్న నేపాలీ దంపతులు దాదాపు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచీలు చోరీ చేశారు. నెలన్నర క్రితమే వీరు వ్యాపారి ఇంట్లో పనిలో చేరారు. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వ్యాపారి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి కుటుంబం నివాసం ఉంటోంది. వీరి ఇంట్లో దాదాపు పదేళ్లకు పైగా నేపాల్ కు చెందిన దంపతులు పని చేశారు. అయితే వీరు స్వగ్రామానికి వెళ్తూ దాదాపు 45 రోజుల కిందట నేపాల్ కు చెందిన మహేశ్ షాహి, అప్సరా దంపతులను పనిలో పెట్టి వెళ్లారు. శనివారం అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి దంపతులు ఊటీకి వెళ్లారు. అనిరుధ్ ఇంటి ఆవరణలోని సర్వంట్స్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న మహేశ్ దంపతులు రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి ముందుగానే సిద్ధం చేసుకున్న కట్టర్లు, కత్తులు, ఇనుప రాడ్ల సాయంతో ఇంట్లోని అల్మారాలు పగలగొట్టారు. అల్మారాల్లో పెట్టిన దాదాపు 2 కోట్ల విలువైన 10 డైమండ్ నెక్లెస్ లు, దాదాపు 10 ఖరీదైన రోలెక్స్ చేతి గడియారాలు తీసుకెళ్లారు. ఇల్లు మొత్తం చిందర వందర చేశారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పాత పని మనుషులు నివసించే ఇంట్లోకి సైతం ప్రవేశించి ఆ ఇంట్లో సైతం చోరీ చేయడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఇంటికి వచ్చిన ఇతర పని మనుషులు అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu