హెరిటేజ్ ఫుడ్స్ పై ఆ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి విడుదల చేసిన వీడియో సందేశం నెట్ లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి నాణ్యతపై రాజకీయంగా విమర్శలు సాగుతున్న తరుణంలో, హెరిటేజ్ ఉత్పత్తుల విశ్వసనీయత గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హెరిటేజ్ సంస్థ ప్రారంభమై 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భువనేశ్వరి గత స్మృతులను నెమరువేసుకున్నారు. కేవలం రూ. 4 కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ ప్రయాణం, నేడు రూ. 4 వేల కోట్ల టర్నోవర్ కలిగిన దిగ్గజ సంస్థగా ఎదగడం వెనుక పట్టుదల, పారదర్శకత ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. సంస్థ ఎంత ఎదిగినా, వినియోగదారులకు అందించే పాల ఉత్పత్తుల విషయంలో నాణ్యత అనే అంశంపై తాము ఎప్పుడూ రాజీ పడలేదని స్పష్టం చేశారు.నాణ్యతా ప్రమాణాలపై వినియోగదారులకు భరోసా ఇస్తూ 'హెరిటేజ్ ప్రామిస్' పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. 'చూసిందే నమ్మండి' అంటూ ఆమె వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ నుండి వచ్చే ప్రతి ఉత్పత్తి కఠినమైన నాణ్యత పరీక్షలను దాటుకుని వస్తుందని భువనేశ్వరి వివరించారు. ప్రతి డెయిరీ ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చే ముందు ఏకంగా 25 రకాల నాణ్యతా పరీక్షలకు గురవుతుంది. ఈ నాణ్యతను కాపాడటం కోసం సంస్థలో 500 మందికి పైగా నిపుణులు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో సుమారు 3 లక్షల మంది పాడి రైతులు హెరిటేజ్‌తో అనుసంధానమై ఉన్నారు. రైతులకు సరైన ధర, పారదర్శకమైన కొలతలు,సమయానికి చెల్లింపులే తమ విజయరహస్యమని ఆమె వెల్లడించారు.
0 Comments