ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి మండలంలోని మేడూరు గ్రామంలో మొబైల్ ఫోనులో ఎక్కువగా మాట్లాడొద్దని భార్యను భర్త మందలించాడు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భార్య గొడ్డలితో భర్తపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మేడూరు గ్రామానికి చెందిన కొర్ర రాజారావు తన భార్య గంటల తరబడి ఫోనులో మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలంటూ భార్యను మందలించాడు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరగడంతో రాజారావు భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లోని గొడ్డలి తీసుకుని రాజారావుపై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలుపాలైన రాజారావును చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి రాజారావు భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
0 Comments