ఈ ఏడాదికి చివరి ఎపిసోడ్ 'మన కీ బాత్'లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత్ 2025లో ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలపై ప్రధాని సమగ్రంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ నెట్‌వర్క్‌లతో పాటు ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెబ్‌సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్‌లో ప్రసారం చేశారు. అలాగే ఆల్ ఇండియా రేడియో న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్ ఛానళ్లలో లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించారు. హిందీ ప్రసారం అనంతరం ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారం జరిగింది. 'మన కీ బాత్'లో ప్రధాని మోడీ కాశ్మీర్‌లోని జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలో ఉన్న జెహన్‌పోరా ప్రాంతం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అక్కడ ఎన్నేళ్లుగా కనిపిస్తున్న ఎత్తైన మట్టిగుట్టలపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టగా, అవి సహజంగా ఏర్పడినవి కాకుండా పురాతన కాలంలో నిర్మించిన పెద్ద కట్టడాల అవశేషాలని తేలిందన్నారు. ఇదే సమయంలో ఫ్రాన్స్‌లోని ఓ మ్యూజియం ఆర్కైవ్స్‌లో బారాముల్లాకు సంబంధించిన పాత చిత్రం బయటపడిందని తెలిపారు. ఆ చిత్రంలో మూడు బౌద్ధ స్తూపాలు కనిపించడం ద్వారా కాశ్మీర్‌కు చెందిన ఘనమైన చరిత్ర ప్రపంచానికి వెలుగులోకి వచ్చిందన్నారు. 'మన కీ బాత్' 129వ ఎడిషన్‌లో ప్రధాని మోడీ కాశీ-తమిళ సంగమంపై మాట్లాడారు. ఈ ఏడాది వారణాసిలో నిర్వహించిన కార్యక్రమాల్లో తమిళ భాష నేర్చుకునే దిశగా ప్రత్యేక ప్రచారం జరిగిందన్నారు. 'తమిళం నేర్చుకుందాం -తమిళ కలాకలమ్' అనే థీమ్‌తో 50కి పైగా పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషల్లో తమిళం ఒకటని, దేశవ్యాప్తంగా యువతలో తమిళ భాషపై ఆసక్తి పెరుగుతుండటం భారత్ ఐక్యతకు నిదర్శనమని అన్నారు. యువత నుంచి తరచూ తమ ఆలోచనలు ఎలా పంచుకోవాలన్న ప్రశ్నలు వస్తుంటాయని ప్రధాని చెప్పారు. దీనికి పరిష్కారంగా 'వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. వచ్చే నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటామని, అదే రోజు ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు. 'ఎక్కడ సంకల్పం ఉంటే అక్కడ మార్గం ఉంటుంది' అన్న మాటను మణిపూర్‌కు చెందిన మొయిరాంగ్‌థెం సేత్ నిజం చేశారని ప్రధాని అన్నారు. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతంలో సౌరశక్తిని వినియోగిస్తూ స్థానిక పరిష్కారాలు చూపించిన ఆయన కృషిని ప్రశంసించారు. సౌరశక్తికి ప్రభుత్వం రూ.80 వేల సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. 2025లో దేశం ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా మరింత బలపడిందని ప్రధాని మోదీ చెప్పారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభం, అయోధ్యలో రామ మందిరంలో జెండా ఆవిష్కరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. స్వదేశీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరిగిన ఆసక్తి దేశానికి మరింత ఆత్మవిశ్వాసం ఇచ్చిందన్నారు. భారత్ సైన్స్, స్పేస్ రంగాల్లో గొప్ప ముందడుగు వేసిందని, శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారని ప్రధాని తెలిపారు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా దేశంలో చీతాల సంఖ్య 30కి మించి పెరిగిందన్నారు. క్రీడారంగంలోనూ 2025 చిరస్మరణీయమైందని, క్రికెట్ నుంచి పారాలింపిక్స్ వరకు త్రివర్ణ పతాకం ఎగిరిందని ప్రధాని గర్వంగా పేర్కొన్నారు.
0 Comments