ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) వద్ద ఉద్యోగులు చేపట్టిన ధర్నాతో రద్దీ సమయంలో సుమారు గంటపాటు సబర్బన్ రైలు సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రైళ్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులు కిందకు దిగి పట్టాల వెంబడి నడవడం ప్రారంభించారు. ఈ క్రమంలో శాండ్‌హర్స్ట్ రోడ్ స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న లోకల్ రైలు ఢీకొని ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులను 19 ఏళ్ల హేలీ మొమయా, మరో గుర్తుతెలియని వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన వారిలో యాఫిసా చోగ్లే (62), ఖుష్బూ మొమయా (45), కైఫ్ చోగ్లే (22) ఉన్నారు. వీరిని జేజే ఆసుపత్రికి తరలించారు. ఆగిపోయిన లోకల్ ట్రైన్ నుంచి దిగి పట్టాలపై నడుస్తుండగా సాయంత్రం 6:50 గంటల సమయంలో వేగంగా వస్తున్న లోకల్ ట్రైన్ వీరిని ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు.
0 Comments