దేశీయ మార్కెట్లో బెంగళూరుకు చెందిన ఈవీ కంపెనీ న్యూమరోస్ మోటార్స్ 'న్యూమరోస్ ఎన్-ఫస్ట్' పేరుతొ రెండో ఎలక్ట్రిక్ టూ-వీలర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.64,999గా నిర్ణయించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 109 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్‌సైకిల్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది నడపడానికి మోటార్‌సైకిల్ లాగా యుటిలిటీ విషయంలో స్కూటర్ లాగా ఉపయోగపడుతుంది. ఈ ఈ-బైక్‌ను ఇటలీకి చెందిన డిజైన్ కంపెనీ 'వీల్‌బ్' సహకారంతో రూపొందించారు. ఇందులో గ్లోబల్ డిజైన్, ఇండియన్ ఇంజనీరింగ్ కలయిక కనిపిస్తుంది. కంపెనీ మొదటి 1000 మంది కస్టమర్ల కోసం ఎన్-ఫస్ట్‌ను కేవలం రూ.64,999 ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఈ ఈ-బైక్‌ను మహిళలు సులభంగా నడపవచ్చని.. ఇది ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో చవకైన, సులభమైన, స్టైలిష్ ఎంపిక అని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ-బైక్ బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ బైక్ 5 వేర్వేరు వేరియంట్లలో ట్రాఫిక్ రెడ్, ప్యూర్ వైట్ రంగులలో లభిస్తుంది. ఇందులో 16-అంగుళాల పెద్ద చక్రాలు ఉన్నాయి. ఇవి సాధారణ స్కూటర్‌లతో పోలిస్తే వాహనానికి ఎక్కువ స్థిరత్వం, నియంత్రణను అందిస్తాయి. జైసల్మేర్‌లోని తీవ్రమైన వేడి నుంచి మనాలిలోని గడ్డకట్టే చలి వరకు.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఈ బైక్‌ను పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది. దీని ప్రధాన ఆకర్షణ దాని సమర్థవంతమైన బ్యాటరీ, రేంజ్ సామర్థ్యాలు. ఈ ఈ-బైక్ కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రెండు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఎంపికల ద్వారా కస్టమర్‌లు తమ రోజువారీ ప్రయాణ అవసరాల ఆధారంగా సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.
0 Comments