సీబీఎస్ న్యూస్ 60 మినిట్స్ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అణ్వాయుధాల పరీక్షలు చేపట్టింది ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదని, ఇటువంటి వాతావరణం ఇతర దేశాల్లోనూ నెలకొని ఉందని అన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తాము మాత్రమే ఈ చర్యలను నిలిపివేశామని, దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం తలెత్తుతోందని ట్రంప్ చెప్పారు. రష్యా, చైనా రహస్యంగా అణు పరీక్షలు చేస్తున్నాయని, దీని గురించి ప్రపంచ దేశాలు తప్పక మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎవరూ దీని గురించి ప్రస్తావించకపోతే ప్రమాదకరమని చెప్పారు. అణ్వాయుధ పరీక్షల గురించి ధైర్యంగా వార్తలు రాసే జర్నలిస్టులు ఆయా దేశాల్లో లేరని అన్నారు. ఉత్తర కొరియా, పాకిస్తాన్ సైతం అదే బాట పట్టాయని, చురుగ్గా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వాళ్లు న్యూక్ టెస్టులు చేపట్టినందున అమెరికా కూడా పరీక్షలు చేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్తాన్ అణు పరీక్షలు చేస్తుంటే, తాము మౌనంగా కూర్చోబోమని, ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేయడానికి సరిపడా అణు ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాకిస్తాన్ అనేది అమెరికా గుడ్‌బుక్స్‌లో లేదని, దాని కార్యకలాపాలపై నిఘా పెట్టామని పరోక్షంగా తెలియజేశారు. చైనా అనుకూల దేశంగా పాకిస్తాన్ కు ముద్రపడటం వల్ల ఆ దేశాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎంతమాత్రం విశ్వసించట్లేదనేది మరోసారి తేటతెల్లమైంది.
إرسال تعليق