రష్యా డ్రోన్, క్షిపణుల దాడుల వల్ల 16 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ జాతీయ పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి సమయంలో ఉక్రెయిన్ పశ్చిమ నగరాలైన ల్వివ్, టెర్నోపిల్‌లలో బహుళ అంతస్తుల భవనాలపై రష్యా డ్రోన్లతో దాడి జరిపింది. దీంతో ఈ నగరాల్లోని నివాసితులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా 470 డ్రోన్లు, 48 క్షిపణులతో దాడులకు పాల్పడిందని జెలెన్‌స్కీ ఆరోపించారు. గత రెండు సంవత్సరాల నుంచి సాగుతున్న ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు పునరుద్ధరించే చర్యల్లో భాగంగా జెలెన్‌స్కీ టర్కీ చేరుకున్నారు. ఈ తరుణంలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడింది. టెర్నోపిల్ నగరంలో రష్యా జరిపిన వైమానిక దాడి వల్ల 16 మంది మరణించారు. 14 మంది పిల్లలతో సహా 64 మంది గాయపడ్డారని జాతీయ పోలీసుల టెలిగ్రామ్ ప్రకటన తెలిపింది. ఈ దాడుల ఫలితంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రిత్వశాఖ తెలిపింది. రష్యా వైమానిక దాడి వల్ల పలు బహుళంతస్తుల భవనాలు దగ్ధమవతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా మంటలు అలుముకుని పొగ కమ్మేసినట్లు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు కనిపిస్తున్నాయి.
إرسال تعليق