యూరోపియన్ యూనియన్ దేశాలకు ఉక్రెయిన్ గుండా వెళ్తున్న రష్యా గ్యాస్ సరఫరా ఈ ఉదయం నుంచి నిలిచిపోయింది. దీంతో ఇంధన సంక్షోభం తలెత్తవచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. 1991 నుంచి ఉక్రెయిన్ మీదుగా రష్యా చౌక ధరకు గ్యాస్‌ను ఈయూ 27 దేశాలకు చేరవేస్తోంది. అయితే ఈ సరఫరా కోసం ఉక్రెయిన్‌తో రష్యా కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పందం నేటితో ముగిసిపోవడం, పైగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంతో తమ భూభాగం గుండా ఆ రవాణాను ఉక్రెయిన్ నిలిపివేసింది. 2021లో రష్యా ఈయూ దేశాలకు 40 శాతం గ్యాస్ ఎగుమతి చేసింది. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం, తదనంతర ఆంక్షల పరిణామాలతో ఈయూ దేశాలు చాలావరకు రష్యా నుంచి గ్యాస్ దిగుమతిని తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో 2023లో అది కేవలం 10 శాతానికి పడిపోయింది. అయితే యూరప్ తూర్పు దేశాలు మాత్రం రష్యా గ్యాస్ మీదనే ఆధారపడుతూ వస్తున్నాయి. వాటిల్లో స్లోవేకియా, ఆస్ట్రియాలాంటి దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. అలా గ్యాస్ సరఫరా ద్వారా ఏడాదికి 5.2 బిలియన్ డాలర్లు రష్యాకు సమకూరుతుండడం గమనార్హం. రష్యా గ్యాస్ నిలిపివేతపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ ''మా రక్తం మీద అదనపు బిలియన్లు వాళ్లను సంపాదించుకోనివ్వం'' అని వ్యాఖ్యానించారు. ఈ చర్యను పోలాండ్ ప్రభుత్వం మాస్కోపై మరో విజయంగా అభివర్ణించింది. ఈ చర్యతో అంతర్జాతీయంగా రష్యా కీలకమైన మార్కెట్ కోల్పోతుందేమో కానీ, రాబోయే రోజుల్లో ఈయూ దేశాలే తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటాయి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నారు. రష్యా గ్యాస్ నిలిచిపోవడంపై యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంధన ధరలు పెరిగి సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం రష్యా గ్యాస్ యూరప్ దేశాలకు ఎంటర్ కావడానికి స్లోవేకియా ప్రధాన పాయింట్‌గా ఉంది. ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ.. దేశాలకు పైప్‌లైన్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై ఇప్పటికే దృష్టిసారించినట్లు స్లోవేకియా ప్రకటించింది. ఈ దేశ ప్రధాని రాబర్ట్ ఫికో స్పందిస్తూ.. ''ఈ నిర్ణయం ఈయూ దేశాలకే శరాఘాతం. రష్యాకు ఎంతమాత్రం కాదు'' అని పేర్కొన్నారు. అంతేకాదు గతవారం రష్యాలో పర్యటించిన ఆయన విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఉక్రెయిన్‌కు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే ఆ వెంటనే పోలాండ్ ఉక్రెయిన్ను బాసటగా నిలిచింది. ఇక యూరోపియన్ కమిషన్ మాత్రం యూరోపియన్ దేశాలు పరిస్థితుల నుంచి గట్టేక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అయితే.. మాల్దోవా లాంటి ఈయూయేతర దేశాలు ఇప్పటికే గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఇంకోవైపు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈయూ దేశాలు రష్యా చీప్ గ్యాస్‌ను సరఫరా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే హంగేరీ, టర్కీ, సెర్బియాలు బ్లాక్‌సీ గుండా టర్క్‌స్ట్రీమ్ గుండా రష్యా తన గ్యాస్ సరఫరా చేస్తోంది. మరికొన్ని దేశాలు ఆ జాబితాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాయి.
0 Comments