హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్య థియేటర్‌లో పుష్ప-2 చిత్ర ప్రదర్శన బుధవారం రాత్రి ఉండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. మరోవైపు, అభిమాన నటుడు అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్ వద్దకు చేరుకున్నారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్‌ను చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఓ మహిళ, ఓ బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే బాలుడికి పోలీసులు సీపీఆర్ చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మహిళతోపాటు బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రేవతి అనే 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే, స్పహ కోల్పోయిన బాలుడు రేవతి కుమారురుడు శ్రీతేజ్(9)గా గుర్తించారు. ఎంతో ఆనందంగా అభిమాన నటుడి సినిమాను చూసేందుకు దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వచ్చిన వారు చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అక్కడున్నవారినికలిచివేసింది. వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది. ''నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం'' అని తెలిపింది.
0 Comments