ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా కంకిపాడు ఫ్లైఓవర్‌పై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మచిలీపట్నానికి చెందిన చీలి ఏసుప్రభు (29), చింతా రవి(38), చీలి భాను(27) వ్యక్తిగత పనుల నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు టైరు హఠాత్తుగా పగిలింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ దాటి దూసుకుపోయి ఎదురుగా చేపల లోడుతో వస్తున్న మినీ వ్యాన్‌ను బలంగా ఢీకొంది. ఆ ధాటికి రెండు వాహనాలు నుజ్జయ్యాయి. ఈ ఘటనలో కారులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందగా.. వ్యాన్‌ డ్రైవర్‌ నందివాడ మండలం పోలుకొండ గ్రామానికి చెందిన కూరెళ్ల కిషోర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు గంటన్నర పాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన అతడిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తన కుమారుడు భాను మృతిచెందాడన్న విషయం తెలిసిన వెంటనే మచిలీపట్నంలోని ఇంటివద్ద ఉన్న అతని తల్లి సుధారాణి(55) తట్టుకోలేకపోయింది. రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Post a Comment

أحدث أقدم