బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. విదేశీ శక్తులు ఆక్రమణకు వస్తే భారతీయులేమైనా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా? అని అన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలపై తమకు హక్కు ఉందంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు వ్యాఖ్యల నేపథ్యంలో దీదీ ఈ విధంగా స్పందించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ కొందరు బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించారు. కేంద్రం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా పశ్చిమ బెంగాల్ కట్టుబడి ఉంటుందన్నారు. ఇదే సమయంలో బంగ్లాలో కొందరు చేసే రెచ్చగొట్టే ప్రకటనలకు స్పందించవద్దని, సంయమనం పాటిస్తూ ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన దేశ విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్‌లో ఉన్నారని, ఇక్కడున్నవారు అనవసరంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ''బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై జరుగుతోన్న దాడులు, అక్కడి నేతల వ్యాఖ్యలను మన రాష్ట్రంలోని ఇమామ్‌లు కూడా ఖండించారు. అక్కడ పరిస్థితులు దిగజారితే మన బంధువులు, మిత్రులపైనా పడుతుంది. అందుకే ఏదైనా వ్యాఖ్యానించేటప్పుడు సంయమనం పాటించండి. రాష్ట్రంలో పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేందుకు మనందరం కలిసి పనిచేయాలి'' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిషాలపై తమ దేశానికి చట్టబద్ధ హక్కులు ఉన్నాయంటూ ఇటీవల ఢాకాలో ఏర్పాటు చేసిన సభలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతలు పేర్కొనడం చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై స్పందించిన మమతా బెనర్జీ.. మన భూమిని ఎవరైనా ఆక్రమించుకోవడానికి వస్తే భారతీయులు ఏమైనా లాలీపాప్‌లు తింటూ కూర్చుంటారా? అని ప్రశ్నించారు. భారత విదేశాంగశాఖ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, తృణమూల్ పార్టీ తప్పకుండా పాటిస్తుందని చెప్పారు. ఇదిలాఉంటే, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, సలహాదారు తౌహిద్ హుస్సేన్‌లతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హిందువులు, మైనారిటీల భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ సహా భారత సరిహద్దుల్లో బంగ్లా దళాలు డ్రోన్ల మోహరించడంపైనా మాట్లాడామన్నారు.
0 Comments