తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్‌ షాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (62), లింగమ్మ దంపతులకు నలుగురు సంతానం. బాలయ్య ఈ నెల 21న సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. అంత్యక్రియలు చేసే సమయంలో ఆస్తి కోసం ఇద్దరు కుమారులు నరేశ్‌, సురేశ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య లింగమ్మకు చెందిన భూమి పెద్ద కోడలి పేరు మీద పట్టా చేసి ఉంది. దీంతో తన వాటా తేల్చే వరకు అంత్యక్రియలు చేసేది లేదని చిన్నకొడుకు సురేశ్‌ అడ్డుపడ్డాడు. మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించకుండా మూడు రోజులపాటు శవపేటికలోనే ఉంచారు. అంతిమసంస్కారాలు నిలిపి వేయడంతో గ్రామస్థులు, బంధువులు, మృతుడి కుమార్తెలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆస్తి విషయం ఎటూ తేలకపోవడంతో చివరకు బాలయ్య కూమార్తెలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు. తన వాటా భూమి తేలకపోతే అంతిమ సంస్కారం జరపవద్దని సురేశ్‌ అడ్డుపడడంతో గ్రామ పెద్దలు కలగజేసుకొని, అన్నదమ్ములిద్దర్నీ కూర్చోబెట్టి నచ్చజెప్పి అంత్యక్రియలు నిర్వహించారు.

Post a Comment

أحدث أقدم