ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నవంబర్‌ 30న జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలా నిర్వహించాలని సూచించారు. శనివారం ఆయన వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. రైతు సదస్సుపై ప్రధానంగా చర్చించారు. వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు, మెలకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులన్నీ స్టాళ్లల్లో ఉంచాలని సీఎం సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు అన్నింటినీ ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతులు అప్పటికప్పుడు వచ్చి వెళ్లేలా కాకుండా, వారికి అవగాహన కల్పించేలా మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 28వ తేదీ నుంచే ఈ స్టాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. దీంతో రాష్ట్రంలోని రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم