శ్రీలంకలోని కొలంబో నుంచి లక్షల లీటర్ల పెట్రోల్‌తో బట్టికలోవాకు వెళ్తున్న రైలు మిన్నేరియా రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అప్పటికే పట్టాలపై ఉన్న ఏనుగుల గుంపును చూసిన లోకోపైలట్ సడన్ బ్రేకులు వేశారు. దాంతో రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో పెట్రోల్ పూర్తిగా లీకై నేలపాలైంది. మిగతా బోగీల నుంచి ఇంధనాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు ఏనుగులు చనిపోగా, మిగతా వాటికి గాయాలైనట్టుగా తెలిసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రైలు కొలంబోలోని కొలోన్నావా పెట్రోలియం స్టోరేజీ టెర్మినల్ నుండి తూర్పు ప్రావిన్స్‌లోని బట్టికలోవాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. సడెన్‌గా బ్రేక్‌లు వేయటం, ఏనుగులను ఢీకొనడంతో నాలుగు ఇంధన ట్యాంకర్లు పట్టాలు తప్పాయని, దీంతో రైల్వే ట్రాక్‌లకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైల్వే శాఖ తెలిపింది. ప్రమాదం కారణంగా కొలంబో-బట్టికలోవా ప్రధాన మార్గంలో రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి.
0 Comments