దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది. ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్‌వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది. అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్‌వేర్ సేవలను అప్‌డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్‌వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
0 Comments