నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న శివ అనే విద్యార్థి కాలేజీ భవనం పై నుండి క్రింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విద్యార్థి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విద్యార్థి. నిన్న రాత్రి కళాశాలలో జరిగిన ఈ ఘటనలో గ్రిల్ సరిగ్గా లేకపోవటంతో విద్యార్థి ప్రమాదవశాత్తు జారి క్రింద పడిపోయాడు. దీంతో విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. విద్యార్థి విగత జీవిగా మారాడు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది . అనూష అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని దసరా సెలవుల తర్వాత కళాశాలకు వచ్చిన క్రమంలో ఆమె విగత జీవిగా మారటం అందరినీ షాక్ కు గురి చేసింది.ఆమె తల్లిదండ్రులు విద్యార్థినిని కాలేజీలో దింపి హైదరాబాద్ దాటే లోపే విద్యార్థిని స్పృహ కోల్పోయిందన్న సమాచారంతో మళ్ళీ తల్లిదండ్రులు కళాశాలకు వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళే సరికి అనూష ఉరి వేసుకొని చనిపోయిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె మృతదేహాన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత జూన్ నెలలో కూడా ఒక విద్యార్ధి నారాయణ కళాశాలలో చదవటం ఇష్టంలేక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా హాయ్ టెన్షన్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ మండలంలోని కోహెడ గ్రామానికి చెందిన నారాయణ జూనియర్ కళాశాలలో చదువుతున్న కర్రే కిషోర్ కుమార్ కళాశాల నుండి పారిపోయే క్రమంలో విగత జీవిగా మారాడు. కారణాలు ఏవైనా సరే జూనియర్ కళాశాలల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న తీరు తీవ్ర ఆవేదనకు కారణంగా మారుతుంది.
0 Comments