కేరళలోని వయనాడ్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంక గాంధీ, అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన కొత్త ప్రయాణాన్ని వయనాడ్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వయనాడ్ వచ్చినట్లు తెలిపారు. రాజకీయాల కంటే ఈ దేశం ముఖ్యమన్నారు. సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరిగారని, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు దేశ వ్యాప్తంగా పర్యటించినట్లు చెప్పారు. వయనాడ్ ప్రజలకు అండగా ఉండేందకు తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి ప్రజలతో కలిసి పోరాడేందుకు, వారి సమస్యల పరిష్కారానికి వయనాడ్‌కు వచ్చినట్లు తెలిపారు. వయనాడ్ ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. వయనాడ్ నుంచి తన సోదరి ప్రియాంక గాంధీని ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ అన్నారు. వయనాడ్ నుంచి అధికారికంగా ఒకరు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తే, మరొకరు అనధికారికంగా వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తామన్నారు. ఇక్కడి ప్రజల కోసం తాను ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానన్నారు. తన తల్లి ఇక్కడ ఉన్నారని, తండ్రి చనిపోయిన తర్వాత తన సోదరి ప్రియాంక గాంధీ అమ్మను చూసుకుంటున్నార్నారు. ప్రియాంక 17 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిందని, అయినప్పటికీ తమ తల్లికి తోడుగా నిలిచిందని రాహుల్ తెలిపారు. ప్రియాంకగాంధీ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలే ప్రియాంక కుటుంబమన్నారు. ఆ కుటుంబం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. వయనాడ్ ప్రజలకు తన సోదరిని అప్పగిస్తున్నానని, ప్రియాంక గాంధీని ఇక్కడి ప్రజలే రక్షించుకోవాలన్నారు. అనధికార ఎంపీగా తాను కూడా తరచూ వయనాడ్‌కు వస్తుంటానని రాహుల్ గాంధీ తెలిపారు. వయనాడ్ సభలో సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
0 Comments