పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాకు చెందిన ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచారం ఘటన నేపథ్యంలో వైద్యుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మృతురాలికి న్యాయం జరగాలంటూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా కోల్‌కతాలోని కలకత్తా మెడికల్ కాలేజ్‌కు చెందిన 60 మంది సీనియర్ డాక్టర్లు తమ రాజీనామాలను సమర్పించారు. మంగళవారం ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ వైద్యులు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరంతా రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించారు. సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. 42 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే తమ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేవని, మృతురాలికి న్యాయం జరగాలంటూ ఏడుగురు జూనియర్ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ వైద్య కళాశాలల్లో మూకుమ్మడి రాజీనామాలు చోటుచేసుకున్నాయి.
0 Comments