మధ్యప్రదేశ్లో కలకలం సృష్టించిన 5 ఏళ్ల చిన్నారి రేప్ కేసు నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. 200మంది పోలీసులు, 500 మంది స్థానికులు, డ్రోన్లతో 5 రోజుల గాలింపు చర్యలు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులకు దొరికే ముందు నిందితుడు అత్మహత్యకు విఫలయత్నం చేశాడు. మధ్యప్రదేశ్లోని హర్డాలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన 22 ఏళ్ల యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు ఈ నెల 23 నుంచి ఐదు రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో సుమారు 200 మంది పోలీసులు, 500 మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు. నైట్ విజన్ టెక్నాలజీతో కూడిన డ్రోన్ సైతం వారికి సాయం అందించింది. దుండగుడిని పట్టుకునేందుకు ఐదు రోజుల పాటు హర్దా, ఖాండ్వా, బేతుల్ సహా మూడు జిల్లాల్లో దాదాపు 250 చదరపు కిలోమీటర్ల మేర గాలింపు చేపట్టారు.నిందితుడిని బేతుల్లోని మోహన్ పురా ప్రాంతాంలో ఆదివారం ఉదయం పట్టుకున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 23న సిరాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నది సమీపంలో ఐదేళ్ల బాధితురాలు కనిపించింది. వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సునీల్ కోర్కు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల రివార్డు సైతం ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని ఖల్వా ప్రాంతానికి చెందిన నిందితుడు మొక్కజొన్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చేరాడు. అత్యాచార ఘటన కలకలం సృష్టించడంతో నిందితుడు తన ఫోన్ను విసిరేశాడు. నిరంతరం సంచరిస్తూ ఉండేవాడని ది హిందూ రిపోర్టు తెలిపింది. అతను మొదట ఖాండ్వాకు వెళ్లాడని, ఆ తర్వాత హర్దాకు తిరిగి వచ్చి బేతుల్కి పారిపోయాడని, అయితే జిల్లా సరిహద్దు సమీపంలో పట్టుబడ్డాడని పోలీసు అధికారి తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పొలాలు, అడవుల్లో మూడు రోజుల పాటు నడిచాడు. అడవిలోని 33 గ్రామాల్లో ముగ్గురు పోలీసు అధికారులను మోహరించినట్టు తెలుస్తోంది. అతడిని పట్టుకున్నప్పుడు అరెస్టు చేస్తారనే భయంతో పొలంలో దొరికిన బాటిల్ నుంచి పురుగుల మందు తాగినట్లు చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు.
0 Comments