మహారాష్ట్ర లోని పుణెకు చెందిన సిద్ధార్థ్ గుప్తా అనే ఇంజినీరింగ్ యువకుడు లేటెస్ట్ డ్రైవర్‌లెస్ టెక్నాలజీకి ఏఐ జోడించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూపొందించాడు. ఈ ట్రాక్టర్ డ్రైవర్ లేకుండానే దుక్కి దున్నేస్తుంది. అలాగే ఇతర వ్యవసాయ పనులను సైతం సునాయాసంగా చేస్తుంది. 2019లో సిద్ధార్థ్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లపై రీసెర్చ్ చేయడం ప్రారంభించాడు. 2023లో తన పరిశోధనను పూర్తి చేసి వీఆర్డీ మోటార్స్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీలో ఏఐ బేస్డ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ట్రాక్టర్లను సోలార్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. దీంతో రైతుకు డ్రైవర్, డీజిల్ ఖర్చు ఆదా అవుతుంది. ఇందులో 15 హెచ్‌పీ, 50 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు రకాల ట్రాక్టర్లు సిద్ధార్థ్ కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ట్రాక్టర్ తయారీలో వాడిన బ్యాటరీ సహా పరికరాలన్నీ దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను సోలార్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే మరొక అదనపు బ్యాటరీ ఇందులో ఉంటుంది. దీనికి ఛార్జ్ చేసి అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఈ ట్రాక్టర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 నుంచి 15 గంటల వరకు నిర్విరామంగా పని చేస్తుంది. ఈ ట్రాక్టర్లకు సిద్ధార్థ్ పేటెంట్ సైతం పొందాడు. అతి త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
0 Comments