ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిల్లల విషయంలో తల్లిదండ్రుల గురించి తన ఆలోచనలను పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. గతంలో యువత కోసం 70 గంటల పని వారానికి చేయాలని సూచించడం వివాదానికి దారితీసింది. ఇప్పుడు, నారాయణ మూర్తి పేరెంటింగ్ సలహాపై కూడా మళ్లీ వివాదాస్పదమైంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు చదువుపై దృష్టి పెట్టాలని చెబుతూ తల్లిదండ్రులు మాత్రం సినిమాలు చూడలేరని అన్నారు. “తల్లిదండ్రులు వెళ్లి సినిమాలు చూసి.. పిల్లలకు ‘వద్దు, వద్దు, మీరు చదువుకోండి’ అని చెబితే (అది పనికిరాదు)” అని పేర్కొన్నారు. నారాయణ మూర్తి తన భార్యతో కలిసి ప్రతిరోజు మూడున్నర గంటలపాటు తమ స్కూల్ రోజుల్లో పిల్లలైన అక్షత, రోహన్ మూర్తితో కలిసి చదివేందుకు ఎలా సమయాన్ని కేటాయించారో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పేరెంటింగ్ సలహాపై నెటిజన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తూ.. “అయితే, తల్లిదండ్రులు మీరు సిఫార్సు చేసినట్లుగా 72 గంటలు పని చేస్తే.. ఇక పిల్లలకు ఎప్పుడు సమయం కేటాయిస్తారు?” అని ప్రశ్నించారు. దీనికి మరో నెటిజన్ “అవును నిజమే.. తల్లిదండ్రులు కూడా వారి 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల ప్రారంభంలో వారి కాలిక్యులాస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. నారాయణ మూర్తి కూడా ఈ వయస్సులో గో లాంగ్ నేర్చుకోవాలి. ప్రతి వారం 70 గంటలు కోడ్ చేయాలి” అని కామెంట్ చేశారు.
0 Comments