హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు జోరు !


భాగ్యనగరంలో ఇళ్ల విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.4,043 కోట్ల విలువైన గృహ విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే 17% అధికమని ప్రముఖ రియల్ ఎస్టేట్‌ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలలో 6,439 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు ఒక శాతం తగ్గుదల నమోదు కావడం గమనార్హం. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో జనవరి నుంచి ఆగస్టు వరకు హైదరాబాద్ నగరంలో 54,483 గృహాలు అమ్ముడైనట్లు నివేదిక తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 18% పెరుగుదల నమోదైంది. జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.33,641 కోట్లు విలువైన ఆస్తులు విక్రయం జరిగిందని, గతేడాదితో పోలిస్తే 41% అధికమని వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఆగస్టు నెలలో అమ్ముడైన వాటిలో రూ.50 లక్షలలోపు విలువ కలిగిన గృహాల వాటా గతేడాది 67 శాతం ఉండగా, ఆ సంఖ్య 59 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. రూ.కోటి, ఆపైన విలువ కలిగిన గృహాల విక్రయాలు 9 శాతం నుంచి 15 శాతానికి పెరిగాయని తెలిపింది. 3 బీహెచ్‌కే గృహ సముదాయాలకు ఎక్కువ ఆదరణ లభించిందని పేర్కొంది. హైదరాబాద్‌ రెసిడెన్షియల్ మార్కెట్‌ దూసుకెళుతోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ పేర్కొన్నారు. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్‌ విక్రయాలు పెరుగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్త ట్రెండ్‌ అనుగుణంగా ఇక్కడా విశాలమైన నివాసాలను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments