సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. అక్టోబర్ 4 వరకు రిమాండ్ కొనసాగనుంది. డెహ్రాడూన్ జైలు నుంచి అర్థరాత్రి విద్యాసాగర్‌ను విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యాసాగర్ తప్పుడు ఫిర్యాదు మేరకు తనపై అక్రమ కేసు బనాయించి తనతోపాటు తన తల్లిదండ్రులను అన్యాయంగా జైలుకు పంపి, చిత్ర హింసలకు గురి చేశారంటూ బాధితురాలు జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈనెల 13వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితునిగా విద్యా సాగర్ తోపాటు మరి కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విద్యా సాగర్‌ను అరెస్ట్ చేసినట్లు ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు అధికారికంగా ప్రకటించారు. పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం గాలించిన ప్రత్యేక బృందాలు ఆయన్ను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. ఆదివారం రాత్రికి విజయవాడ చేరుకోనున్న పోలీసు బృందాలు నిందితుడిని సోమవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యం లో జత్వానీ కేసులో విద్యాసాగర్‌కు కోర్టు రిమాండ్ విధించింది. ముంబయి నటి కేసులో పూర్తి -స్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. జత్వానికి భద్రత కల్పిస్తున్నామన్నారు. విద్యాసాగర్ ఫిర్యాదుపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జెత్వానీని అరెస్టు చేసిన కేసులో అప్పటి పోలీసులు పొందుపరిచిన పలువురు సాక్షులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
0 Comments