ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాల ఘటన వివాదం సద్దుమణిగింది. సీఎం ఆదేశాలతో పోలీసులు గుడ్లవల్లేరు ఘటనపై విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలో దాదాపు 4గంటలకుపైగా హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్‌ను గుర్తించే పరికరంతో హాస్టల్‌లో అణువణువూ తనిఖీ చేశారు. ఎలాంటి హిడెన్ కెమెరా లభించలేదు. తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళన విరమించారు. సోమవారం వరకు సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ లోగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకు మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎలాంటి చర్యలు, కక్షసాధింపు ఉండరాదని కళాశాల యాజమాన్యానికి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి, హాస్టల్‌లో ఉండేందుకు విద్యార్థినులు అంగీకరించారు.
إرسال تعليق