ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే పట్టణంలో మే నెలలో రెండు ఆసుపత్రులపై పోలీసులు దాడి చేశారు. కుంభకోణాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడినవారు అరెస్టు నుంచి తప్పించుకొనేలా ప్లాస్టిక్ సర్జరీలు ఈ ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారు. అక్కడ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ టూల్స్, డెంటల్ ఇంప్లాంట్స్, స్కిన్ వైట్‌నింగ్ ఐవీ డ్రిప్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైం అధిపతి జాన్ కాసియో పేర్కొన్నారు. ఇక్కడ ముగ్గురు డాక్టర్లను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు వియత్నాం వాసులు కాగా, ఒకరు చైనా పౌరుడు. వారికి అక్కడ పని చేయడానికి అనుమతులు లేవు. మరో రెండు అక్రమ ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు. ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే నాలుగు రెట్లు పెద్దవని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపుకార్డులను ఎవరూ అడగరని అధికారులు చెబుతున్నారు. ఇక్కడికొచ్చే క్లైయింట్లలో ఎక్కువమంది ఆన్‌లైన్ కేసినోలకు చెందినవారని, దీంతోపాటు ఫిలిప్పీన్స్‌లో అక్రమంగా పనిచేస్తున్నవారు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 2022లో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్టు చేశారు. అతడు చట్టం నుంచి తప్పించుకొనేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నట్లు గుర్తించారు. ఇక్కడి ఆన్‌లైన్ కేసినోలు చైనాలోని జూదగాళ్లకు సేవలు అందిస్తుంటాయి. అక్కడ గ్యాంబ్లింగ్ నేరం. ఇక ఈ సంస్థలే టెలిఫోన్ స్కామ్‌లు, హ్యూమన్ ట్రాఫికింగ్‌లకు పాల్పడుతుంటాయి. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఇవి మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు సాగాయి. కానీ, కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్‌పై స్కాం దేశంగా ముద్ర పడటాన్ని ఇష్టపడలేదు. దీంతో చర్యలు చేపట్టారు.
0 Comments