ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్లు డీఆర్‌ఎం అవినీతి ఆరోపణలతో సీబీఐ అధికారులకు చిక్కారు. గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే లైన్ల అభివృద్ధికి జరుగుతున్న పనుల్లో గుత్తేదారుల నుంచి లంచం తీసుకుంటూ పలువురు అధికారులు పట్టుబడ్డారు. గుంతకల్లు డివిజన్‌లో రూ.500 కోట్లతో గతిశక్తి పథకంలో రైల్వే వంతెనల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు చేస్తున్న గుత్తేదారుల నుంచి గుంతకల్లు రైల్వే ఫైనాన్స్ విభాగం అధికారులు భారీగా లంచం డిమాండ్ చేశారు. లంచంతో పాటు స్టార్ హోటళ్లలో విలాసవంతమైన గదులు, భారీ పార్టీలకు కాంట్రాక్టర్లతో ఖర్చు పెట్టిస్తూ బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారుల వేధింపులు పెచ్చుమీరడంతో పీలేరుకు చెందిన గుత్తేదారు రమేష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగుకు చెందిన మరో రైల్వే కాంట్రాక్టర్... సీబీఐ అధికారులను ఆశ్రయించారు. లంచం తీసుకుంటున్న రైల్వే అధికారులను సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మూడు రోజుల పాటు గుంతకల్లు డీఆర్‌ఎం కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనంతరం డీఆర్‌ఎం వినీత్ సింగ్, డీఎఫ్ఎం ప్రదీప్ బాబు, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ అక్కిరెడ్డి, రైల్వే ఎస్ఈ బాలాజీలతోపాటు అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మీపతిరాజులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పిలిపించిన సీబీఐ అధికారులు.. వారి అరెస్టుకు గల కారణాలను వివరించారు. లంచం తీసుకున్న నిందితులకు గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కర్నూలు సీబీఐ కోర్టులో హాజరు పర్చారు.
0 Comments