ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో స్థానికులకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేటు సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్) కోరింది. ఇటువంటి ఆంక్షలు విధిస్తే, నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సాఫ్ట్‌వేర్ కంపెనీలు తరలివెళ్లడానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ''కర్ణాటక స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్, 2024 ఆమోదం పొందడం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అందులో ఉన్న నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోన్న వేళ.. తాజా బిల్లులోని నిబంధనలతో అవి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే, బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తీవ్ర పోటీతత్వం నెలకొన్న నేటి తరుణంలో ఆంక్షలు విధిస్తే.. నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కొరత ఏర్పడి, సంస్థలు వేరే చోటుకి తరలిపోవచ్చు'' అని నాస్కామ్ పేర్కొంది. ఇదే అంశంపై ప్రైవేటు రంగ నిపుణులు, సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్ణయాలతో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయని, పెట్టుబడులు ఆగిపోతాయని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్ హెచ్చరించారు. సాంకేతిక రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, దానిని ప్రభావితం చేసే బిల్లుని అనుమతించకూడదని బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా సూచించారు. నైపుణ్యమున్న సిబ్బంది నియామకాల విషయంలో మినహాయింపులు ఉండాలన్నారు.
0 Comments